హన్మకొండ: విద్యుత్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ నిరుపేద కుటుంబానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ రామన్నపేటకు చెందిన జన్ను మల్లయ్య గత కొన్ని నెలల క్రితం జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతి చెందారు.
విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే నాయిని స్వయంగా బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, బాధిత కుటుంబం ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ సాంబ రెడ్డితో పాటు ఇతర స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
అనుకోని ప్రమాదంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తమ కుటుంబానికి ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే చేసిన ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుందని బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


