కాజీపేట: కాజీపేట ప్రాంత అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆయన కాజీపేట 63వ డివిజన్ పరిధిలోని జూబ్లీ మార్కెట్ ఏరియాలో పర్యటించారు.
సుమారు కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు వారు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు.
శంకుస్థాపన చేసిన వారం రోజుల్లోనే పనులు ప్రారంభించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కాజీపేట అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించామనేది తాను ఓపెన్‌గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు.
గతంలో శంకుస్థాపన చేసిన కాజీపేట 30 పడకల ఆసుపత్రికి పునర్ వైభవం తీసుకువస్తామని, నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


