హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా “అరైవ్ అలైవ్” (Arrive Alive) పేరుతో నిర్వహిస్తున్న రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలను సోమవారం హన్మకొండలోని కాలోజి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద హాజరయ్యారు. అతిథులంతా కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అవగాహన సదస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వంటి చిన్నపాటి జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయని సూచించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా ఉండాలని పిలుపునిచ్చారు.
యువత, ముఖ్యంగా కళాశాల విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కలిగి ఉండటమే కాకుండా ఇతరులను కూడా చైతన్యవంతం చేయాలని కోరారు.

ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాల పరిధిలో ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయి. వారం రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు, సదస్సుల ద్వారా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్, రవాణా, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు మరియు పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.


