వరంగల్: విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ప్రైవేట్ మెడికల్ కాలేజీల అక్రమాలపై తల్లిదండ్రులు గళమెత్తారు. వరంగల్లోని కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వ విద్యాలయం (KNRUHS) ఎదుట ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రైవేట్ మెడికల్ మేనేజ్మెంట్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని వారు ఆరోపించారు.
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయని, నిబంధనలకు వ్యతిరేకంగా అదనపు ఫీజుల పేరిట తల్లిదండ్రులపై భారం వేస్తున్నారని వారు మండిపడ్డారు.
లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్నప్పటికీ, కాలేజీలలో కనీస వసతులు కల్పించడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయని డిమాండ్ చేశారు.
మెడికల్ కాలేజీలలో ఇంకా ర్యాగింగ్ భూతం వెంటాడుతోందని, విద్యార్థుల మానసిక స్థితిని దెబ్బతీస్తున్న ర్యాగింగ్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని, యూనివర్సిటీ దీనిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని కోరారు.
యూనివర్సిటీ గేటు వద్ద బైఠాయించిన తల్లిదండ్రులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్సిటీ అధికారులు జోక్యం చేసుకుని ప్రైవేట్ కాలేజీలపై చర్యలు తీసుకునే వరకు తమ నిరసన విరమించేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.


