హసన్‌పర్తి: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని, అది ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ ప్రచారంలో భాగంగా వంగపహాడ్ గ్రామంలో ప్రత్యేక అవగాహన సదస్సు మరియు బైక్ ర్యాలీ నిర్వహించారు.
సీఐ చేరాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ అనంతరం, యువతతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
సుమారు 100 మందికి పైగా గ్రామస్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అర్హులైన వారికి హెల్మెట్లను పంపిణీ చేశారు.
నిబంధనలు పాటిస్తామని, హెల్మెట్ లేకుండా వాహనం నడపబోమని గ్రామస్తులందరితో ప్రమాణం చేయించారు.
రోడ్డు ప్రమాదంలో తలకు తగిలే చిన్న చిన్న గాయాలు కూడా ప్రాణాంతకం కావచ్చు. అటువంటి సమయంలో మిమ్మల్ని రక్షించేది కేవలం హెల్మెట్ మాత్రమే. మీరు వాహనంపై బయటకు వెళ్ళినప్పుడు, మీ కోసం ఇంట్లో మీ భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు ఎదురుచూస్తుంటారని గుర్తుంచుకోండి అని తెలిపారు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి.
ప్రజల భాగస్వామ్యం ఉంటేనే రోడ్డు ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించగలమని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సైలు రవి, గోవర్ధన్, స్థానిక కార్పొరేటర్ లావుడ్య రవినాయక్, రిలీఫ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రమేష్, గ్రామ పెద్దలు, యువకులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


