ఏఐ నిర్ణయం బెడిసికొట్టింది..క్షణాల్లో రూ.4800 కోట్ల నష్టం :
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంస్థల పనితీరును వేగవంతం చేస్తూ ఉత్పాదకతను పెంచుతుంది. అయితే సరైన నియంత్రణలో పర్యవేక్షణ లేకుండా ఏఐ వినియోగిస్తే ఎంతటి ఆర్థిక నష్టం సంభవించచ్చో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన స్పష్టం చేసింది. ఒక ప్రముఖ సంస్థ తన ఉద్యోగులకు ఏఐ ప్లాట్ ఫామ్ వినియోగంపై ఎలాంటి పరిమితులు విధించకపోవడంతో కేవలం ఒక నెల వ్యవధిలోని సుమారు 500 మిలియన్ల డాలర్లు అంటే దాదాపు 4800 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.
సమాచారం ప్రకారం.. సంస్ధ ఉద్యోగులకు ఏఐ సేవలను పూర్తిగా స్వేచ్ఛగా ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. అయితే వినియోగాన్ని పర్యవేక్షించే రియల్ టైం డాష్ బోర్డులు ఖర్చు పరిమితులు లేదా బడ్జెట్ హెచ్చరికల వంటి వ్యవస్థలు ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తమ పనులను ఆటోమేటిక్ చేయడానికి అధునాత ఏఐ ఏజెంట్లు కోడింగ్ టూల్స్ మరియు ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోలను రూపొందించారు. నిరంతరాయంగా పనిచేస్తూ భారీ పరిమాణంతో డేటాను విశ్లేషించాయి. ఫలితంగా టోకెన్లు వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది.
ఏఐ ప్లాట్ ఫామ్ లు సాధారణంగా టోకెన్లు ఆధారంగా పనిచేస్తాయి. వినియోగదారుడు ఇచ్చే ప్రతి సూచన ఏఐ అందించే ప్రతి సమాధానం టోకెన్ల రూపంలో లెక్కించబడుతుంది. వినియోగం పెరిగే కొద్దీ ఖర్చు కూడా భారీగా పెరుగుతుంది. పర్యవేక్షణ లేకుండా నడిచిన ఈ ఆటోమేటెడ్ ప్రక్రియలు చివరకు సంస్థకు వేల కోట్ల రూపాయల బిల్లును మిగిల్చాయి. ఈ ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు అప్రమత్తమయ్యాయి. వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థలు ఖర్చులపై తక్షణ హెచ్చరికలు అందించే డాష్ బోర్డును ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తున్నాయి.
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిన సరైన గవర్నెన్స్ మరియు ఆర్థిక నియంత్రణలో లేకపోతే చిన్న పొరపాటు కూడా భారీ నష్టాలకు దారితీస్తుందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది.


