ఎయిర్ ఫ్రైయర్ ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..:
ఎక్కువ నూనెతో డీప్ ఫ్రై చేయడానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం చాలామంది ఎయిర్ ఫ్రైయర్‌ను ఉపయోగిస్తున్నారు. తక్కువ నూనెతోనే కరకరలాడే ఆహారాన్ని తయారు చేసుకోవచ్చనే కారణంతో ఇది వంటగదిలో ముఖ్యమైన పరికరంగా మారింది. అయితే ఎయిర్ ఫ్రైయర్లో వండిన ప్రతీ ఆహారం ఆరోగ్యకరమేనా అనే సందేహం చాలామందికి ఉంది.
నూనె లేకుండా ఎలా ఫ్రై అవుతుంది?
ఎయిర్ ఫ్రైయర్లో ఆహారం నూనెలో మునిగే విధంగా వేయించరు. పరికరం లోపల వేడి గాలిని వేగంగా ప్రసారం చేస్తుంది. బాస్కెట్‌లోని రంధ్రాల ద్వారా వేడి గాలి ఆహారం చుట్టూ సమానంగా ప్రసరించడం వల్ల బయట పొర కరకరలాడుతూ బంగారు రంగులోకి మారుతుంది. దీంతో డీప్ ఫ్రైతో పోలిస్తే చాలా తక్కువ నూనెతో వంట పూర్తవుతుంది.
కేలరీలు తగ్గే అవకాశం :
పొటాటో వెడ్జెస్, ఫ్రోజెన్ ఫ్రైస్, నగ్గెట్స్ వంటి ఆహారాలను ఎయిర్ ఫ్రైయర్లో తయారు చేస్తే అదనంగా నూనె జోడించాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. ఫలితంగా నూనె ద్వారా వచ్చే అదనపు కొవ్వు, కేలరీలను తగ్గించుకోవచ్చు. అయితే ప్యాక్ చేసిన ఫ్రోజెన్ ఆహారాల్లో ఇప్పటికే కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వాటిని మితంగా తీసుకోవాలి.
కోటింగ్ విషయంలో జాగ్రత్త అవసరం :
ఎయిర్ ఫ్రైయర్ కొనుగోలు చేసేటప్పుడు బాస్కెట్, పాన్‌పై ఉన్న కోటింగ్‌ను కూడా పరిశీలించడం మంచిది. కొన్ని మోడళ్లలో PTFE నాన్‌స్టిక్ కోటింగ్, మరికొన్నింటిలో సిరామిక్ లేదా స్టెయిన్లెస్ స్టీల్ ఉపరితలాలు ఉంటాయి. ముఖ్యంగా పరికరాన్ని తయారీదారు సూచించిన ఉష్ణోగ్రతలకు మించి వేడి చేయకుండా ఉపయోగించడం ముఖ్యం.
అక్రిలమైడ్ గురించి ఆందోళన అవసరమా? :
అధిక ఉష్ణోగ్రతల వద్ద కొన్ని ఆహారాలను వండినప్పుడు అక్రిలమైడ్ అనే పదార్థం ఏర్పడవచ్చు. ముఖ్యంగా బంగాళదుంపల వంటి ఆహారాల్లో ఇది ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఎయిర్ ఫ్రైయింగ్ వల్ల తప్పనిసరిగా అక్రిలమైడ్ ఎక్కువవుతుందని చెప్పలేం. 2015లో Journal of Food Scienceలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో డీప్ ఫ్రై చేసిన బంగాళదుంపలతో పోలిస్తే ఎయిర్ ఫ్రై చేసిన వాటిలో అక్రిలమైడ్ స్థాయులు గణనీయంగా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ఆరోగ్యకరమైన ఎంపికేనా?
మొత్తంగా చూస్తే డీప్ ఫ్రైయింగ్‌తో పోలిస్తే తక్కువ నూనె, కొవ్వు, కేలరీలతో ఆహారాన్ని తయారు చేసుకునే అవకాశం ఉండటం ఎయిర్ ఫ్రైయర్ ప్రయోజనమే. అయితే ఎయిర్ ఫ్రైయర్లో వండిన ప్రతి ఆహారం ఆరోగ్యకరమని భావించకూడదు. తాజా కూరగాయలు, తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎంచుకుని, ఉప్పు-కొవ్వు పరిమాణాన్ని నియంత్రించడం మరింత ముఖ్యం.


