నర్సంపేట డివిజన్, ఖానాపూర్ మండలం అశోక్ నగర్ పరిధిలో అరుదైన చారిత్రక సంపద బయటపడటం ఆసక్తికరంగా మారింది.
అశోక్ నగర్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో పిచ్చిమొక్కలు, చెట్ల పొదలను తొలగించి చదును చేస్తున్న క్రమంలో, భూమిలో నిక్షిప్తమై ఉన్న పురాతన కట్టడాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి కాకతీయుల శైలిని పోలి ఉండటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవ రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ కట్టడాన్ని పరిశీలించారు.
వారసత్వ సంపద పరిరక్షణ: బయటపడిన కట్టడం మన పూర్వీకుల నాగరికతకు, కాకతీయుల కాలం నాటి వైభవానికి నిదర్శనమని, దీనిని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.

ఈ కట్టడం యొక్క కాలాన్ని, విశిష్టతను నిర్ధారించడానికి పురావస్తు శాఖ అధికారులతో మరియు చరిత్రకారులతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. పురావస్తు శాఖ నివేదిక ఆధారంగా ఈ కట్టడాన్ని పర్యాటక లేదా చారిత్రక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


