Breaking: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు..!:
పోక్సో కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న బండి భగీరథ్‌కు మల్కాజిగిరి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత రెండు వారాలుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు, వాదనలు పరిశీలించిన అనంతరం బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఒక బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కేసు దర్యాప్తు సమయంలో విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అనంతరం భగీరథ్ తన న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు.
అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఆయనను చర్లపల్లి జైలు నుంచి మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రక్రియ కూడా నిర్వహించారు. కేసుకు సంబంధించిన పలు అంశాలపై విచారణ కొనసాగించిన అధికారులు, కీలకమైన డిజిటల్ ఆధారాలను తొలగించేందుకు ప్రయత్నించారనే అనుమానాల నేపథ్యంలో అదనపు సెక్షన్లను కూడా కేసులో చేర్చినట్లు సమాచారం.
ఇప్పటికే దర్యాప్తులో భాగంగా అవసరమైన ప్రక్రియలు పూర్తయ్యాయని, బెయిల్ మంజూరుకు అర్హత ఉందని కోర్టులో రక్షణ పక్షం వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కొన్ని షరతులు విధిస్తూ భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే కేసు విచారణ కొనసాగనున్న నేపథ్యంలో కోర్టు నిర్దేశించిన నిబంధనలను ఆయన తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
Read Warangal News and Latest Politics News and Real Estate


