పోక్సో కేసులో ముగిసిన బండి భగీరథ్ కస్టడీ.. చర్లపల్లి జైలుకు తరలింపు:
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పై మూడు రోజుల పాటు కొనసాగిన పోలీస్ కస్టడీ ముగిసింది. విచారణ అనంతరం అతడిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు కఠినన భద్రత నడుమ చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో నమోదైన ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
దర్యాప్తును మరింత లోతుగా కొనసాగించేందుకు పోలీసులు కోర్టు నుంచి ప్రత్యేక కస్టడీ అనుమతి పొందారు. ఈ మూడు రోజుల విచారణలో కేసుకు సంబంధించిన కీలక సమాచారం, డిజిటల్ ఆధారాలు, సంఘటనల క్రమంపై నిందితుడి నుంచి వివరాలను సేకరించినట్లు సమాచారం. కస్టడీ మొదటి రోజు భగీరథ్ ను చర్లపల్లి జైలు నుంచి మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం మొయినాబాద్ పరిసరాల్లోని అరణ్య ఫామ్ హౌస్ కి తరలించి ఘటన జరిగిన తీరును పునర్మిస్తూ సీన్ ” రీకన్‌స్ట్రక్షన్ ” చేపట్టారు. రెండో రోజు గచ్చిబౌలిలోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో విచారణ కొనసాగించారు. విచారణలో భాగంగా బాధితురాలితో ఇంస్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్ చాట్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా జరిగిన చాటింగ్ లకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను నిందితుడి ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా భగీరథ్ స్టేట్మెంట్ ను కూడా పోలీసులు నమోదు చేశారు.
ఇప్పటికే బాధితురాలు, ఆమె తల్లి, అలాగే ఫామ్ హౌస్ కి వెళ్ళిన భగీరథ్ స్నేహితుల వాంగ్మూలాలను అధికారులు నమోదు చేశారు. అదనంగా సీసీ కెమెరా ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు, బాధితురాలు తల్లి అందించిన కాల్ రికార్డింగ్ లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేసులో మరికొన్ని కీలక అంశాలపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.


