వేలేరు మండల కేంద్రానికి చెందిన గంజి రమేష్‌బాబు కుటుంబం పోగొట్టుకున్న సుమారు 16 లక్షల రూపాయల విలువ చేసే 100 గ్రాముల బంగారు ఆభరణాలను వేలేరు పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకొని బాధితులకు అందజేశారు.
నిన్న మధ్యాహ్నం గంజి రమేష్‌బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి లింగంపల్లి సమ్మక్క సారలమ్మ జాతరకు బయలుదేరారు.
ఈ క్రమంలో మినరల్ వాటర్ ట్యాంక్‌ను నింపుకునేందుకు ట్యాంక్ తీస్తుండగా, కారు డిక్కీలో ఉన్న బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్ కింద పడిపోయింది. దీన్ని గమనించకుండా వారు జాతరకు వెళ్లిపోయారు.
తిరుగు ప్రయాణంలో డిక్కీలో బ్యాగ్ కనిపించకపోవడంతో కంగారు పడిన రమేష్‌బాబు ఇంట్లో కూడా వెతికినా దొరకలేదు.
రోడ్డు మార్గంలో ఎక్కడో పడిపోయి ఉంటుందని అనుమానించి ఈ రోజు ఉదయం వేలేరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వేలేరు పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎస్సై సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు.
రోడ్డుపై పడిపోయిన బ్యాగ్‌ను అక్కడి ఒక వ్యాపారి తీసుకున్నట్లు గుర్తించారు.
ఆ వ్యాపారి నుంచి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని, ఎస్సై సురేష్ కుమార్ చేతుల మీదుగా బాధిత దంపతులకు అందజేశారు.
తమ బంగారు ఆభరణాలను వేగంగా స్వాధీనం చేసుకుని తిరిగి అందజేసిన వేలేరు పోలీసులకు బాధితులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


