వరంగల్లో మద్యం మత్తులో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేసిన ఘటన కలకలం రేపింది. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉర్సుగుట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా వివాదం మరింత ముదిరింది.
112కు సమాచారం.. ఘటనాస్థలికి పోలీసులు :
ఉర్సుగుట్ట వద్ద ఓ బెటాలియన్ కానిస్టేబుల్ మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్నాడంటూ 112కు సమాచారం అందింది. దీంతో బీట్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ షర్టు లేకుండా ఉండటాన్ని గమనించిన బీట్ సిబ్బంది.. షర్టు వేసుకోవాలని సూచించినట్లు సమాచారం.
మాటామాటా పెరిగి ఘర్షణ :
బీట్ కానిస్టేబుల్ సూచనను బెటాలియన్ కానిస్టేబుల్ పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో ఇరువురూ ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నట్లు సమాచారం. అనంతరం రోడ్డుపైనే లాఠీలతో పరస్పరం కొట్టుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
బీట్ కానిస్టేబుల్ ఫిర్యాదు :
ఈ ఘటనపై బీట్ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసిన పరిస్థితులు, ఘటన సమయంలో జరిగిన పరిణామాలపై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.


