బీసీ హాస్టళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. జూన్ 30 వరకు అవకాశం :
వరంగల్ జిల్లాలో ప్రభుత్వ బీసీ హాస్టల్లో 2026-27 విద్యాసంవత్సరానికి విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతున్న అర్హులైన బీసీ, ఇ.బీ.సీ విద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పుష్పలత వెల్లడించారు.
ప్రీ-మెట్రిక్ మరియు పోస్ట్-మెట్రిక్ హాస్టల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ప్రీ-మెట్రిక్ హాస్టళ్లకు, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఫార్మసీ వంటి కోర్సులు అభ్యసిస్తున్న వారు పోస్ట్-మెట్రిక్ హాస్టళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జిల్లావ్యాప్తంగా ప్రీ-మెట్రిక్ హాస్టళ్లలో మొత్తం 27 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గీసుకొండలో 35, నల్లబెల్లిలో 40, నర్సంపేటలో 30, పర్వతగిరిలో 52 బాలుర సీట్లు ఖాళీగా ఉన్నాయి
అలాగే పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో మొత్తం 226 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వరంగల్, వర్ధన్నపేట, నర్సంపేట ప్రాంతంలోని బాలురు, బాలికల హాస్టళ్లలో ఈ సీట్లు భర్తీ చేయనున్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వసతి భోజన సౌకర్యాలతో పాటు అనుకూలమైన విద్యావాతరణం కల్పించడమే హాస్టల్ లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు.
అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా జూన్ 30వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు కోరుతున్నారు.
విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు అవసరమైన వసతి సౌకర్యాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో లభిస్తున్నందున అర్హులైన విద్యార్థులు గడువు ముగిసే లోపు తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు.


