హన్మకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శిస్తూ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌ని కలిసి వినతిపత్రం సమర్పించింది.
అధికారంలోకి వచ్చేందుకు ప్రకటించిన ‘6 గ్యారెంటీలను’ తక్షణమే అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు తాము విశ్రమించబోమని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రావు పద్మ, రాణి రుద్రమ, కాళీ ప్రసాద్, కార్పొరేటర్ వసంత తదితర కీలక నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.


