కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు..:
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసన కార్యక్రమాలకు సిద్ధమైంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది.
సెప్టెంబర్ 1 నుంచి నిరసనలు:
సెప్టెంబర్ 1న చార్జ్‌షీట్ కార్యక్రమంతో నిరసనలకు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ భవన్లో తొలిరోజు కార్యక్రమం నిర్వహించి, కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఆరోపణలను ప్రజల ముందుంచనుంది. సెప్టెంబర్ 2న ఆరు గ్యారెంటీల వైఫల్యాలను ఎత్తిచూపుతూ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, బహిరంగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
రైతులు, మహిళల సమస్యలపై ఫోకస్:
సెప్టెంబర్ 3న వ్యవసాయ విద్యుత్, రైతు సమస్యలపై నిరసనలు చేపట్టనున్నారు. అలాగే 22ఏ నిషేధిత భూముల అంశంపై హైదరాబాద్, అర్బన్ ఏరియాల్లో ధర్నాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 4న విద్యార్థులు, వికలాంగులు, మహిళల సమస్యలను ప్రస్తావిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
ఉద్యోగాలు, సంక్షేమంపై నిరసనలు:
సెప్టెంబర్ 5న విద్యార్థులు, యువతకు సంబంధించిన ఉద్యోగాలు, ఉపాధి అంశాలపై నిరసనలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 6న ఆదిలాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలతో పాటు హైదరాబాద్‌లో ధర్నా, ఇతర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
సెప్టెంబర్ 8న ముగింపు:
సెప్టెంబర్ 7న ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించి, జిల్లాలు, మండల ప్రజావాణి కేంద్రాల్లో సమస్యలను ప్రస్తావించనున్నారు. సెప్టెంబర్ 8న జిల్లా కేంద్రాల్లో నిరసనలతో పాటు హైదరాబాద్‌లో భారీ కార్యక్రమం నిర్వహించి వారం రోజుల కార్యక్రమాలను ముగించనున్నారు. ప్రతి నియోజకవర్గంలోని గల్లీగల్లీలో కాంగ్రెస్ హామీల అమలుపై ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చింది.


