ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) మరోసారి సామాజిక బాధ్యతను చాటుకుంది. సమాజ శ్రేయస్సు కోసం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘స్వస్థ్ నారీ, వికసిత్ భారత్’ కార్యక్రమానికి AAFA మద్దతు అందించింది. ముఖ్యంగా HPV వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై యువతుల్లో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించింది.
8 రాష్ట్రాల్లో 820 అవేర్‌నెస్ ఈవెంట్స్ :
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు అండమాన్-నికోబార్ దీవుల్లోని పాఠశాలలు, కమ్యూనిటీల్లో AAFA ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మొత్తం 820 స్కూల్ అవేర్‌నెస్ ఈవెంట్స్ నిర్వహించగా.. దాదాపు 3 లక్షల మంది యువతులకు ఈ కార్యక్రమాల ద్వారా చేరువైనట్లు అసోసియేషన్ తెలిపింది.
బాలికలకు HPV వ్యాక్సిన్‌పై అవగాహన :
ముఖ్యంగా 9 నుంచి 14 ఏళ్ల వయసున్న బాలికలకు HPV వ్యాక్సిన్ ప్రాధాన్యతను వివరించారు. సరైన వయసులో టీకా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో HPV సంబంధిత వ్యాధులు, ముఖ్యంగా గర్భాశయ ముఖ క్యాన్సర్ ముప్పును తగ్గించుకునే అవకాశం ఉంటుందని అవగాహన కల్పించారు.
అభిమానుల సమష్టి కృషి :
సామాజిక బాధ్యతతో అల్లు అర్జున్ అభిమానులు దేశవ్యాప్తంగా ఒక్కటై ఈ కార్యక్రమాలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. కుటుంబాలు HPV వ్యాక్సిన్‌పై అవగాహన పెంచుకుని, వైద్యుల సూచనల మేరకు పిల్లలకు టీకా వేయించాలని AAFA సూచించింది. బాలికల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ కార్యక్రమంపై అభిమానులకు ప్రశంసలు లభిస్తున్నాయి.


