బురహాన్‌పల్లిలో సీసీ కెమెరాలు, సైబర్ నేరాల నివారణపై అవగాహన సదస్సు:
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురహాన్ పల్లి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు మరియు సైబర్ నేరాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సూదుల ఉమాదేవి దేవేందర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పోలీసులు, అధికారులు, గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్సై ముత్యం రాజేందర్ మాట్లాడుతూ..”సీసీ కెమెరాలు గ్రామ భద్రతను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. నేరాల నివారణతో పాటు ఏదైనా గొడవ జరిగినప్పుడు దర్యాప్తుకు సీసీ కెమెరాల ఫుటేజ్ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. గ్రామాల్లో ప్రధాన కూడళ్లు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు”.
అలాగే ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, ఆన్లైన్ లింకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు ఎవరికి తెలియజేయవద్దని చెప్పారు. సమాజ భద్రతలో ప్రజా భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ అనుమానస్పద సంఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల్లో భద్రత అవగాహన పెంపొందించడంలో ఉపయోగకరంగా నిలిచింది.


