వరంగల్: ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) వరంగల్ రీజియన్ కీలక నిర్ణయం తీసుకుంది. రీజియన్ పరిధిలోని 9 డిపోలలో బస్సు సర్వీసులు తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రారంభమయ్యాయి. ఉదయం షిఫ్టుకు సంబంధించిన సిబ్బంది సకాలంలో విధులకు హాజరై, డిపోల నుండి బస్సులను బస్టేషన్ పాయింట్లకు చేరవేశారు.
రీజియన్ వ్యాప్తంగా రవాణా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా పెద్ద సంఖ్యలో బస్సులను అందుబాటులోకి తెచ్చారు:
సంస్థ బస్సులు: 596
అద్దె బస్సులు: 325
ఎలక్ట్రిక్ బస్సులు: 115
మొత్తంగా వెయ్యికి పైగా బస్సులు వివిధ రూట్లలో ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి.
ఈ సర్వీసులను విజయవంతంగా నిర్వహించేందుకు డ్రైవర్లు, కండక్టర్లు కలిపి మొత్తం 3,286 మంది రెగ్యులర్ ఉద్యోగులు, అలాగే 600 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు యథావిధిగా విధుల్లో చేరారు. తెల్లవారుజాము నుంచే బస్సులు అందుబాటులోకి రావడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఊరట లభించింది.


