స్టేషన్ ఘనపూర్, మార్చి 13:
చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీర్వాదాలు అందుకున్నారు.
తదుపరి ఆలయ ఈవో అధ్యక్షతన నిర్వహించిన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఆలయ పాలక వర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆలయ పాలకవర్గం చైర్మన్‌గా పొట్లపల్లి శ్రీధర్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, శ్రీధర్ రావు భక్తి భావంతో పాటు సేవా భావంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన స్వంత ఖర్చులతో ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రశంసించారు.
చిల్పూర్ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక స్థానం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లేనని అన్నారు.
ఆలయ అభివృద్ధి కోసం రూ.10 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసి రెండు నెలల్లో నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిలోనే అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
ఆలయానికి ఎదురుగా నిర్మించిన ఇళ్లకు ప్రత్యామ్నాయంగా ఇతర చోట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా హద్దులు నిర్ణయించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, పాలకవర్గ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.


