భూమి వివాదం కొత్త మలుపు.. పోలీస్ అధికారిపై డీజీపీకి ఫిర్యాదు:
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో భూమి వివాదం నేపథ్యంలో స్థానిక సీఐ శ్రీధర్ రావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడానికి సీఐ రూ.2 లక్షలు లంచం తీసుకున్నప్పటికీ న్యాయం చేయలేదని బాధితుడు బొంపెల్లి సుధీర్ రావు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు.
సుధీర్ రావు తెలిపిన వివరాల ప్రకారం, ధర్మసాగర్ మండలం పెద్దపండ్యాల నర్సింగరావుపల్లె రోడ్డులో తన భార్య కృష్ణప్రియ పేరుతో 2013లో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అయితే కొంతకాలంగా మణుగూరు కనకయ్య అనే వ్యక్తి ఆ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై రెండు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
భూమి సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన సీఐ శ్రీధర్ రావు, ఒక మధ్యవర్తి అయిన రిటైర్డ్ ఏసీపీ ద్వారా ఏప్రిల్ 23న రూ.1 లక్ష, అనంతరం మే 5న మరో రూ.1 లక్ష తీసుకున్నారని సుధీర్ రావు ఆరోపించారు. మొత్తం రూ.2 లక్షలు చెల్లించినప్పటికీ తనకు న్యాయం జరగలేదని, పైగా భూమి ఆక్రమణకు పాల్పడిన వ్యక్తికే పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సుధీర్ రావు రాష్ట్ర డీజీపీని ఆశ్రయించి సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణలను సీఐ శ్రీధర్ రావు ఖండించారు. కొందరు వ్యక్తులు కావాలనే తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారుల విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Warangal News and Latest Politics News and Real Estate


