గీసుగొండ: గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ విధుల్లో చూపిన ప్రతిభ, నిబద్ధతకు వరంగల్ పోలీస్ కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్ ప్రశంసలు అందజేశారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన క్రైమ్ రివ్యూ సమావేశంలో ఆయనకు ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతిని అందించారు.
గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా, తంబాకు వంటి నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై సీఐ విశ్వేశ్వర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని నియంత్రణలోకి తీసుకువచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నపిల్లలు వ్యసనాలకు గురికాకుండా చేపట్టిన నిఘా, అవగాహన కార్యక్రమాలను కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సీఐ విశ్వేశ్వర్ చూపిస్తున్న క్రమశిక్షణ, అంకితభావం ఇతర పోలీసు అధికారులకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ప్రజాసేవలో పోలీసులు ఇదే నిబద్ధతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


