హసన్ పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో పాత కక్షలు మరోసారి రాజుకున్నాయి. రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి తీవ్ర ఘర్షణకు దారితీసింది.
గ్రామానికి చెందిన ముసుకు రాజేంద్రప్రసాద్ కుటుంబంపై ప్రత్యర్థి వర్గీయులు కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో రాజేంద్రప్రసాద్‌తో పాటు, ఆయనకు అడ్డువచ్చిన మహిళలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
దాడి చేసిన వారు అంతటితో ఆగకుండా ఇళ్లపై రాళ్లు రువ్వడమే కాకుండా, అక్కడ ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనతో వంగపహాడ్ గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా ఉంచారు.


