హైదరాబాద్, మార్చి 6: ఎస్సి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైదరాబాద్లోని శిల్పకళ వేదికలో మాదిగ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు.
ఈ సందర్భంగా దేశంలోనే మొదటిసారిగా ఎస్సి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, దాదాపు 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఎస్సి వర్గీకరణ సమస్యకు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో పరిష్కారం తీసుకువచ్చిన తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు.
ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు చట్టబద్ధత కల్పించేందుకు సీఎం కృషి చేశారని తెలిపారు.
మాదిగ మరియు మాదిగ ఉపకులాలు చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోని గొప్ప జాతి అని పేర్కొన్నారు.
మంచి చేసిన వారిని గౌరవిస్తామని, చెడు జరిగితే ఎదురు తిరుగుతామని స్పష్టం చేశారు.
కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి వారిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారని ఆయన అభినందించారు.
పేద వర్గాల అభివృద్ధికి విద్య, వైద్యం, సంక్షేమం అత్యంత కీలకమని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య అందిస్తే దళిత పిల్లలు ఎవరికీ తీసిపోరని స్పష్టం చేశారు.
సమాజంలో అసమానతలు తొలగాలంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్య అంటే కేవలం భవనాలు, ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రభుత్వం, ఉపాధ్యాయులు కలిసి విద్యకు మూలస్తంభాలని తెలిపారు.
దళిత సంక్షేమం మరియు విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరింత కృషి చేస్తే తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


