తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త:
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పైరేడ్స్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు అధికారులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు కీలకమైన ప్రకటనలు చేస్తూ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని సీఎం తెలిపారు. జూన్ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా పలు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కానున్నాయని చెప్పారు. ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ , అటవీశాఖ, టౌన్ ప్లానింగ్, విద్యాశాఖ తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రతి నెల రెండు నుంచి మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేలా ప్రణాళికను రూపొందించినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం పై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ప్రస్తుతం వివిధ శాఖల్లో 3800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లభించాయని.. జూన్ 2, 3 తేదీల్లో అటవీ శాఖ సివిల్ ఇంజనీరింగ్ విభాగం, విద్యుత్ శాఖ, విద్యాశాఖలోని డిప్యూటీ డిఈఓ పోస్టులతో పాటు ఇతర ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. అలాగే రోడ్లు భవనాల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వంటి కీలక విభాగాలలో కూడా నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీలో పూర్తి పారదర్శకత పాటిస్తామని అర్హత కలిగిన ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.


