హైదరాబాద్:
బీఆర్ఎస్ నాయకుల నరనరాన అబద్ధాలు జీర్ణించుకుపోయాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో విపరీతంగా అప్పులు చేసి పెట్టిందని, ఆ కారణంగానే ప్రస్తుతం ప్రాజెక్టుల కోసం కొత్తగా నిధులు లేదా అప్పులు తెచ్చుకోలేని క్లిష్ట పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.
రూ.52 వేల కోట్ల అప్పులు తీర్చాం:
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పులకు గానూ ఇప్పటివరకు ఏకంగా రూ.52 వేల కోట్లు కేవలం వడ్డీలు, అసలు రూపంలో చెల్లించాల్సి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని కుంటుపడకుండా చూస్తున్నామని పేర్కొన్నారు.
పాలమూరు ప్రాజెక్టుపై ప్రశ్నల వర్షం:
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై గత ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అంచనా చేసేది కొంత, ఖర్చు పెట్టేది కొంత. “రూ.55 వేల కోట్ల అంచనా వేసిన పాలమూరు ప్రాజెక్టుకు కేవలం రూ.27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే సగం నిధులు (50 శాతం) కూడా ఖర్చు పెట్టకుండానే, 90 శాతం పనులు ఎలా పూర్తవుతాయి?” అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. అసంపూర్తి ప్రాజెక్టులను చూపించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


