నిర్మల్: నిర్మల్ జిల్లాలో రైతన్నలకు తీరని అన్యాయం జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట, చేతికొచ్చే సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలి బూడిదవ్వడం స్థానికంగా అందరినీ కలచివేస్తోంది.
నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో సాగు చేసిన మొక్కజొన్న, వరి, జొన్న పంటలు ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ లైన్లు తక్కువ ఎత్తులో ఉండటం వల్లే షార్ట్ సర్క్యూట్ సంభవించిందని సమాచారం. అప్పులు చేసి, కష్టపడి పండించిన పంట కళ్లముందే కాలిపోతుంటే రైతులు గుండెవిసిలా విలపిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. “ప్రజల ఆకలి తీర్చడమే తప్ప మరో కల్మషం తెలియని అన్నదాతకు పంట అంటే సొంత బిడ్డతో సమానం” అంటూ ఈ ఘటనపై నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం తక్షణ స్పందన :-
ఈ హృదయవిదారక ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. నష్టపోయిన రైతుల వివరాలను త్వరగా సేకరించి, వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి రైతులకు భరోసా ఇవ్వాలని జిల్లా కలెక్టరును ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ లైన్ల నిర్వహణపై దృష్టి సారించాలని సంబంధిత శాఖలకు సూచించారు.
రైతులను ఆదుకోవడం అధికారుల కనీస బాధ్యత అని, బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.


