వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన చెన్నూరి సోమయ్య అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో అతనికి చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన రూ.2,50,000 విలువైన LOC (Letter of Credit) కాపీని గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ LOC కాపీని అందజేశారు. ఈ LOC ద్వారా హైదరాబాద్ నిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చెన్నూరి సోమయ్యకు చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల వైద్య అవసరాల విషయంలో ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యుడిగా తన దృష్టికి వచ్చే ప్రతి అనారోగ్య సమస్యపై తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.
అలాగే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేస్తూ, లక్షల రూపాయలు ఖర్చయ్యే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలుకాకుండా ప్రభుత్వ నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో తాను అందించే LOCల ద్వారా ఉచితంగా మెరుగైన వైద్యం పొందాలని సూచించారు.
ఆపద్కాలంలో సహాయం అందించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారికి చెన్నూరి సోమయ్య కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ తదితరులు పాల్గొన్నారు.


