అటవీ భూముల సమస్యలపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు:
జిల్లాల్లో అటవీ భూములను సంబంధించిన సమస్యల పరిష్కారం పై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాలు పర్యటించి అటవీ భూముల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఝల్లి, తిమ్మరాయినిపహాడ్, ఎల్లాయిగూడెం గ్రామాల పరిధిలో ఉన్న భూములను సందర్శించి అక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి నికిత, నర్సంపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ఉమారాణి కలిసి కలెక్టర్ కి భూముల వివరాలను వివరించారు. గ్రామాల్లో భూముల హక్కులు సాగు పరిస్థితులు.. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వివరాలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.
స్థానిక రైతులు తమ సమస్యలకు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అనేక సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూములకు సంబంధించి హక్కుల సమస్యలు ఎదురవుతున్నాయి అని వాటి పరిష్కారానికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. రైతుల సమస్యలను ఓర్పుతో విన్న కలెక్టర్ అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
భూముల విషయంలో ఎలాంటి అయోమయం లేకుండా రెవెన్యూ అటవీ శాఖలు సమన్వయంతో పని చేయాలి అని ఆమె సూచించారు. గ్రామాల వారీగా పూర్తి వివరాలు సేకరించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు . ఈ పర్యటనలో డీసీఓ నీరజ, చెన్నారావుపేట మండల తతహసీల్దార్ మహమ్మద్ ఆబిద్ అలీ, ఏడీ సర్వే ల్యాండ్ శ్రీనివాస్, ఇతర రెవెన్యూ మరియు అటవీ శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


