హన్మకొండ/మడికొండ: తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మడికొండ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దహనం చేసి, బీజేపీ ప్రభుత్వానికి మరియు ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలంగాణ సంస్కృతిని, అస్తిత్వాన్ని అవమానించేలా మాట్లాడటం సహించరానిదని నాయకులు మండిపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే తెలంగాణ గడ్డపై తిరగనివ్వబోమని హెచ్చరించారు. “జై కాంగ్రెస్”, “జై జై సోనియమ్మ” అంటూ కార్యకర్తలు భారీగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజల పోరాట పటిమను, ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి చూపే అధికారం ఎవరికీ లేదు. పరాయి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడి ప్రజలను అవమానిస్తే తగిన బుద్ధి చెబుతాం – స్థానిక కాంగ్రెస్ నాయకులు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


