కొండా సురేఖ స్థానంలో ఆ మహిళా నేత? కాంగ్రెస్‌లో మంత్రి మార్పుపై ఆసక్తికర చర్చ..!
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. మంత్రి కొండా సురేఖ స్థానంలో మరో మహిళా నేతను మంత్రివర్గంలోకి తీసుకురావాలనే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతోంది.
కొండా సురేఖపై చర్చ ఎందుకు? :
మంత్రి కొండా సురేఖ తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగుతున్నారు. గత కొంతకాలంగా ఆమె రాజకీయ వ్యాఖ్యలు, పార్టీ వ్యవహారాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఆమె కూతూరు రాజకీయ వ్యాఖ్యలు, వాటిపై వచ్చిన స్పందనలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గంలో మార్పులు ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే మంత్రి పదవి మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక సమాచారం లేదు. కేవలం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చల ఆధారంగానే ఈ ప్రచారం కొనసాగుతోంది.
ఆ మహిళా నేత ఎవరనే దానిపై ఆసక్తి:
కొండా సురేఖ స్థానంలో మరో మహిళా నేతకు అవకాశం ఇవ్వొచ్చనే ప్రచారం ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పార్టీలో సీనియారిటీ, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తే.. ఆ స్థానాన్ని బీసీ వర్గానికి చెందిన హైదరాబాద్ మాజీ మేయర్, కేకే కుమార్తె విజయలక్ష్మీతో భర్తీ చేసే అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయలక్ష్మీకి మంత్రి పదవి ఇస్తే పార్టీకి రాజకీయంగా కలిసొస్తుందనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రానున్న వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోనూ ఆమెను నిలిపే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
విజయశాంతి ప్రయత్నాలు ముమ్మరం :
మరోవైపు సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి సైతం మంత్రి పదవి కోసం ఢిల్లీ కేంద్రంగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. వరంగల్ జిల్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తున్న ఆమె.. అవకాశం కల్పిస్తే తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటానని పార్టీ పెద్దల వద్ద చెబుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరే సమయంలో తనకు ఇచ్చిన హామీలను కూడా ఆమె గుర్తు చేస్తున్నట్లు సమాచారం. విజయశాంతికి మంత్రి పదవి కట్టబెడితే ప్రభుత్వం, పార్టీలోనూ బలమైన వాణిగా వ్యవహరించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాములమ్మకు మంత్రి పదవి దాదాపు ఖాయమనే ప్రచారం కూడా ఊపందుకుంది.
అయితే ఒకవైపు విజయలక్ష్మీ పేరు, మరోవైపు విజయశాంతి ప్రయత్నాలతో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ చేతుల్లోనే ఉండటంతో.. పార్టీ అధిష్ఠానం ఎవరికి అవకాశం కల్పిస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.


