వరంగల్: చేనేత కళపై ఉన్న ప్రత్యేక అభిమానంతో స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ఐపీఎస్ ఆదర్శంగా నిలుస్తున్నారు. వరంగల్ నగర ప్రత్యేకతను చాటుతూ భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న కొత్తవాడ కార్పెట్స్ తయారీని, స్థానిక చేనేత మగ్గాలను ఆమె స్వయంగా సందర్శించి పరిశీలించారు.
టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేతృత్వంలో సోమవారం కొత్తవాడకు విచ్చేసిన సీపీ శ్వేత, నేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. నూలు వడకడం, కండెలు చుట్టడం, అచ్చు అతకడం నుండి మగ్గంపై వస్త్రం రూపుదిద్దుకునే వరకు ప్రతి దశను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తయారయ్యే కొత్తవాడ కార్పెట్లు, శాయంపేట టవల్స్, లుంగీలు, బెడ్‌షీట్లతో పాటు మహదేవ్‌పూర్ దస్రు పట్టు చీరలు, జనగాం ఇక్కత్ పట్టు చీరల నాణ్యతను ఆమె పరిశీలించి కార్మికుల నైపుణ్యాన్ని ప్రశంసించారు.
పోలీస్ రిటైర్‌మెంట్ వీడ్కోలులో ఇకపై చేనేత వస్త్రాలే బహుమతి
పోలీసు శాఖలో పదవీ విరమణ పొందే సిబ్బందికి ఇచ్చే సాంప్రదాయ శాలువాలకు బదులుగా చేనేత టవల్, పూజా మ్యాట్‌లను అందించాలని చిప్ప వెంకటేశ్వర్లు చేసిన విజ్ఞప్తికి సీపీ సానుకూలంగా స్పందించారు. తక్షణమే పోలీసు శాఖ తరఫున చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటిని అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
గతంలో సిద్దిపేట ఎస్పీగా పనిచేసిన సమయంలోనూ అక్కడి ప్రసిద్ధ గొల్లభామ చీరలు, చేనేత శాలువాలను కొనుగోలు చేసి ఉన్నతాధికారులు, మిత్రులకు కానుకలుగా అందించి చేనేతకు ప్రాచుర్యం కల్పించినట్లు సీపీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
సీపీ శ్వేత కార్మికులకు అండగా నిలుస్తున్న తీరును కొనియాడుతూ, జిల్లాలోని ఇతర ఉన్నతాధికారులు కూడా చేనేత ఉత్పత్తులను వినియోగిస్తూ కార్మికులకు చేదోడువాదోడుగా ఉండాలని చిప్ప వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అడిగొప్పుల సంపత్, దువ్వల రాజేందర్, యెలుగం సాంబయ్య, జగన్ తదితరులు పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


