రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బలంతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధ్వజమెత్తారు. ఈ నెల 6వ తేదీన హన్మకొండలో బీఆర్‌ఎస్ నిర్వహించ తలపెట్టిన ‘రైతు సంగ్రామ సభ’ విజయవంతం కాకుండా అడ్డుకునేందుకే కాంగ్రెస్ నేతలు కుటిల యత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
బీఆర్‌ఎస్ సభకు పోటీగా కాంగ్రెస్ పార్టీ కావాలనే ‘రైతు మేళా’లను ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. నగరం అంతటా బీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన పార్టీ జండాలను కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా తొలగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల పక్షాన నిలబడేందుకే రైతు సంగ్రామ సభ నిర్వహిస్తున్నామని, దీనికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తోందని ఎద్దేవా చేశారు.
”కాంగ్రెస్ నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలి. ఎన్ని కుట్రలు చేసినా రైతు సంగ్రామ సభ విజయవంతం కావడం ఖాయం. “— దాస్యం వినయ్ భాస్కర్, మాజీ చీఫ్ విప్


