న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్లమెంట్ వేదికగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య శుక్రవారం పార్లమెంట్ మకర ద్వారం వద్ద భారీ ధర్నా చేపట్టారు.
కాంగ్రెస్ ఎంపీలతో కలిసి చేపట్టిన ఈ నిరసనలో కడియం కావ్య ఫ్లాకార్డులను ప్రదర్శిస్తూ బీజేపీ తీరును ఎండగట్టారు. “తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలి”, “బీజేపీ వెంటనే క్షమాపణ చెప్పాలి” అంటూ ఎంపీలు చేసిన నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం మార్మోగింది.
ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు.
దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, ఎంతోమంది యువకుల బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని భారత్-పాక్ విభజనతో పోల్చడం అత్యంత దుర్మార్గం. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమే.
రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని ఆమె గుర్తు చేశారు.
తెలంగాణ పట్ల బీజేపీ నేతలు నిరంతరం వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారని, గతంలో ‘బ్లాక్ డే’ వంటి వ్యాఖ్యలు చేసి ఇప్పుడు విభజనతో పోల్చడం వారి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.
తేజస్వీ సూర్య తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కడియం కావ్య డిమాండ్ చేశారు.


