హన్మకొండ జిల్లా, 66వ డివిజన్, హసన్పర్తి పరిధిలో వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి మరో అడుగు వేస్తూ ముఖ్యమైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది.
గాంధీ విగ్రహం సమీపంలో సుమారు రూ.1 కోటి 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులు, విజయ గార్డెన్స్ పరిసరాల్లో రూ.14 లక్షలతో పైప్‌లైన్ పనులు, హసన్పర్తి పెద్ద చెరువు వద్ద రూ.4.99 లక్షలతో ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
వరంగల్ ఎంపీ శ్రీమతి కడియం కావ్య, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి లతో కలిసి ఈ కార్యక్రమాన్ని గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, వర్ధన్నపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి తన జీవిత లక్ష్యమని, ప్రజల నమ్మకానికి తగినట్లు పాలన అందించడమే తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, ఆరోగ్యం, క్రీడా సదుపాయాలు వంటి ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి డివిజన్‌లో సమానంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసి పైప్‌లైన్, ఓపెన్ జిమ్‌లు వంటి ప్రజాపయోగ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యతే కీలకమని, నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి పనిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, ప్రజలకు నిజంగా ఉపయోగపడేలా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.
ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, వాస్తవ పనులే తన పాలనకు నిదర్శనమని అన్నారు. రాజకీయాలకు అతీతంగా, కులమత భేదాలు లేకుండా అందరికీ న్యాయం చేసే పాలన అందిస్తున్నామని వివరించారు.
ప్రజల ఆశీర్వాదాలు, సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే నాగరాజు గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, ఆత్మకూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, డివిజన్, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


