వరంగల్: వరంగల్ పోలీసింగ్‌కు ప్రస్తుతం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, ఆర్థిక నేరాలు, రోడ్డు భద్రత ప్రధాన సవాళ్లుగా మారాయని డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు. ఒకప్పుడు నక్సలిజం పోలీసింగ్‌లో అతిపెద్ద సవాలైతే, ఇప్పుడు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, ఆర్థిక నేరాలు, రోడ్డు భద్రత ప్రధాన సవాళ్లుగా మారాయని రాష్ట్ర డిజిటల్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పనితీరును ఆయన సమీక్షించారు. సాంకేతికత ఎంత కీలకమైనా మౌలిక పోలీసింగ్‌ను విస్మరించరాదని అధికారులకు సూచించారు.
హన్మకొండ ఎన్‌ఐటీలో నిర్వహించిన ఈ సమావేశంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB), టీ-స్పార్క్, సీఐడీ అధికారులు సైబర్ నేరాల ధోరణులు, దర్యాప్తు విధానాలు, నూతన సాంకేతిక వ్యవస్థలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
వరంగల్‌తో విడదీయరాని అనుబంధం
తన ఐపీఎస్ ఉద్యోగ జీవితం వరంగల్‌లోనే ప్రారంభమైందని డీజీపీ గుర్తు చేసుకున్నారు. “ఇక్కడ జిల్లా శిక్షణ పొంది, అనంతరం వరంగల్ రూరల్ ఎస్పీగా పనిచేసిన రోజులు మరువలేనివి. నక్సలిజం తీవ్రంగా ఉన్న రోజుల్లో ల్యాండ్‌మైన్ పేలుళ్లు, దాడుల నడుమ ప్రతి రోజు ప్రమాదకరంగా ఉండేది. నేడు రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలు పోలీసు అమరుల త్యాగాల ఫలితమే” అని భావోద్వేగానికి గురయ్యారు.
సైబర్ మోసాలతో రూ.1,700 కోట్ల నష్టం
గత ఏడాది తెలంగాణలో సైబర్ నేరాల వల్ల ప్రజలు సుమారు రూ.1,700 కోట్లు కోల్పోయారని డీజీపీ వెల్లడించారు. బాధితులు మోసపోయిన వెంటనే ఫిర్యాదు చేయకపోవడం వల్లే డబ్బు రికవరీ అవకాశాలు తగ్గుతున్నాయన్నారు. ముఖ్యంగా అధిక లాభాల పేరుతో జరిగే పెట్టుబడి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయితే, సైబర్ నేరాల నియంత్రణలో ప్రధానమంత్రి ప్రగతి సమీక్షలో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు.
మౌలిక పోలీసింగ్‌కే ప్రాధాన్యం
సాంకేతికత పోలీసింగ్‌కు తోడ్పాటే కానీ, అది ప్రాథమిక విధుల స్థానాన్ని భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని, దర్యాప్తులు, కోర్టు కేసుల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. డీసీపీలు, ఏసీపీలు, డీఎస్పీలు క్షేత్రస్థాయిలో ఎక్కువ సమయం గడుపుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
యువత, చిన్నారులను లక్ష్యంగా డ్రగ్స్..
చాక్లెట్ల రూపంలో చిన్నారులను మాదకద్రవ్యాలకు అలవాటు చేసే ప్రయత్నాలు జరగడం ఆందోళనకరమని డీజీపీ అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ నివారణలో విద్యాసంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు వరంగల్ జిల్లాలో చేపట్టిన ‘నేను సైతం’ కార్యక్రమాన్ని, ముఖ్యంగా నల్లబెల్లి, పర్వతగిరి పోలీసుల చర్యలను ఆయన అభినందించారు.
వరంగల్ సీపీ సమీక్షలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలు వెల్లడిస్తూ.. కమిషనరేట్ పరిధిలో 50 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. 3,758 మంజూరైన పోస్టుల్లో 2,976 మంది విధులు నిర్వర్తిస్తుండగా, 782 పోస్టులు (20 శాతం) ఖాళీగా ఉన్నాయన్నారు. నేరాల నమోదు సుమారు 10 శాతం పెరిగిందని తెలిపారు.
బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి రైళ్లలో వచ్చి వరంగల్, కాజీపేట కేంద్రంగా చైన్‌స్నాచింగ్, బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామని సీపీ వివరించారు. NATGRID సహకారంతో నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.
కమిషనరేట్ పరిధిలో దోపిడీ కేసులు గతంలో 7 నుంచి 18, తాజాగా 29కి పెరిగాయి. సైబర్ మోసాల కేసులు 25 నుంచి 59కి, ఈ ఏడాది (2026) జనవరి-జూలై వ్యవధిలోనే ఏకంగా 119కి పెరిగాయి. ఉద్యోగాల పేరుతో మోసాలపై 40 కేసులు, ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) అక్రమాలపై 117 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
FAQ’s
1. వరంగల్ పోలీసింగ్‌కు ప్రధాన సవాళ్లు ఏవి?
సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, ఆర్థిక నేరాలు, రోడ్డు భద్రత ప్రధాన సవాళ్లుగా డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.
2. తెలంగాణలో సైబర్ నేరాల వల్ల ఎంత నష్టం జరిగింది?
గత ఏడాది తెలంగాణలో సైబర్ నేరాల కారణంగా ప్రజలు సుమారు ₹1,700 కోట్లను కోల్పోయారని డీజీపీ తెలిపారు.
3. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి?
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 50 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.
4. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి?
3,758 మంజూరైన పోస్టుల్లో 2,976 మంది పనిచేస్తుండగా 782 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
5. సైబర్ మోసం జరిగితే ప్రజలు ఏం చేయాలి?
మోసం జరిగిన వెంటనే పోలీసులకు/సంబంధిత అధికారిక సైబర్ క్రైమ్ వ్యవస్థకు ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బు రికవరీ అవకాశాలను పెంచుకోవచ్చు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

