ఆగస్టు 26న నేపాల్‌లో చోటుచేసుకున్న భారీ హిమపాతం, అవలాంచ్ ఘటన ఇప్పుడు భారత్‌కు కూడా కీలక హెచ్చరికగా మారింది. మంచు, రాళ్లు, మట్టి ఒక్కసారిగా కదిలితే హిమాలయ ప్రాంతాల్లో పరిస్థితి ఎంత వేగంగా మారిపోతుందో ఈ ఘటన మరోసారి చూపించింది. ముఖ్యంగా వాతావరణ మార్పుల నేపథ్యంలో భారత హిమాలయాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నేపాల్‌లో ఏం జరిగింది? :
టిబెట్ సరిహద్దుకు సమీపంలోని నేపాల్ ప్రాంతంలో భారీ మంచు, అవలాంచ్ విరిగిపడి భోటే కోషి నదీ వ్యవస్థలోకి దూసుకెళ్లింది. దీంతో నది ప్రవాహం ఒక్కసారిగా మారిపోయింది. నీరు, మట్టి, రాళ్లు కలిసి లోయల వైపు వేగంగా ప్రవహించడంతో బెట్రావతి పట్టణ ప్రాంతాల్లో విధ్వంసకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ ఘటన జరిగిన ప్రాంతంలో సుమారు 20.25 హెక్టార్ల విస్తీర్ణంలో కొత్త సరస్సు ఏర్పడటం మరింత ఆందోళన కలిగించింది. మంచు, రాళ్లు, మట్టి సహజంగా అడ్డుగా పేరుకుపోవడంతో నీరు నిలిచిపోయింది. ఈ అడ్డంకి బలహీనపడితే మరోసారి భారీ వరద ముప్పు ఉండొచ్చనే ఆందోళనలు ఉన్నాయి.
భారత్‌కూ ఇదే ముప్పు? :
హిమాచల్‌ప్రదేశ్ నుంచి సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ వరకు విస్తరించిన భారత హిమాలయ ప్రాంతాల్లో వేలాది హిమనదులు, హిమ సరస్సులు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కొన్ని హిమనదులు వెనక్కి తగ్గుతుండగా, కొన్ని సరస్సులు విస్తరిస్తున్నాయి. దీంతో పర్వత వాలులు, సహజ సరస్సు గట్లపై కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి.
భారత్ గతంలోనే ఇలాంటి విపత్తులను ఎదుర్కొంది. 2021లో చమోలీ, 2023లో సిక్కింలో సౌత్ లోనాక్ సరస్సు ఉప్పొంగిన ఘటనలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఇటీవల ధారాలి వరదలు కూడా హిమాలయ ప్రాంతాల ప్రమాద తీవ్రతను గుర్తుచేశాయి.
పెరుగుతున్న హిమ సరస్సులే అసలు టెన్షన్ :
అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో ఉన్న కొన్ని హిమ సరస్సులపై కూడా నిపుణుల దృష్టి ఉంది. అందులో సన్హాపో సరస్సు విస్తీర్ణం 2016లో 55.87 హెక్టార్లుగా ఉండగా, 2026లో 87.02 హెక్టార్లకు పెరిగింది. జూన్ 2026 పరిశీలనలో ఇది 88.81 హెక్టార్లుగా నమోదైంది. ఒక సరస్సు గట్టు బలహీనపడినా, కొండచరియలు నదిని అడ్డుకున్నా భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా నీరు విడుదలైతే మట్టి, బండరాళ్లు, చెట్ల దుంగలు కూడా ప్రవాహంతో కలిసి లోయల్లోకి దూసుకెళ్లవచ్చు.
ముందస్తు నిఘా తప్పనిసరి :
హిమాలయ ప్రాంతాల్లో ప్రమాదకర సరస్సులను ముందుగానే గుర్తించి నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. సరస్సు గట్టు తెగితే వరద ఎంత వేగంతో, ఎంత దూరం ప్రయాణిస్తుందో ముందుగానే మోడలింగ్ చేసి, ఆ మార్గంలోని గ్రామాలు, రహదారులు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.
నేపాల్ ఘటన భారత్‌కు ఇచ్చిన సందేశం ఒక్కటే.. హిమాలయాల్లో చిన్న మార్పును కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కొండపై మొదలైన ప్రమాదం క్షణాల్లో వందల కిలోమీటర్ల దూరంలోని జనావాసాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పటికైనా అప్రమత్తమై ప్రమాద ప్రాంతాలను గుర్తించడం అత్యవసరం.


