ఆన్లైన్ ప్రపంచంలో పిల్లలను టార్గెట్ చేసేందుకు సైబర్ కేటుగాళ్లు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో, మెసేజింగ్ యాప్‌లలో కొన్ని ఎమోజీలను కోడ్లుగా ఉపయోగిస్తూ పిల్లలతో పరిచయం పెంచుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
ఎమోజీలను చూసి ఆందోళన చెందొద్దు:
అయితే ఏదైనా ఎమోజీ కనిపించినంత మాత్రాన అది ప్రమాదానికి సంకేతంగా భావించాల్సిన అవసరం లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఎమోజీని ఏ సందర్భంలో, ఎలాంటి సంభాషణలో ఉపయోగించారన్నది పరిశీలించడం ముఖ్యమని చెబుతున్నారు. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.
తెలియని వ్యక్తుల మెసేజ్‌లపై అప్రమత్తత:
తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు, స్నేహ అభ్యర్థనలు, అశ్లీల కంటెంట్, వ్యక్తిగత ఫొటోలు లేదా వీడియోలు పంపాలని అడగడం వంటి అంశాలను తల్లిదండ్రులు సీరియస్‌గా తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లలు ఇలాంటి సందేశాలను స్వీకరించినప్పుడు భయపడకుండా తల్లిదండ్రులకు లేదా విశ్వసనీయ పెద్దలకు చెప్పేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
సైబర్ మోసాలపై ఫిర్యాదు చేయొచ్చు:
పిల్లలను లక్ష్యంగా చేసుకుని అనుమానాస్పదంగా ఎవరైనా సంప్రదించినా, సైబర్ వేధింపులు లేదా ఇతర ఆన్లైన్ నేరాలకు గురైనా వెంటనే స్పందించాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ సంబంధిత ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. అప్రమత్తత, తల్లిదండ్రుల పర్యవేక్షణతో పిల్లలను ఆన్లైన్ ప్రమాదాల నుంచి రక్షించుకోవచ్చని సూచించారు.


