వరంగల్: ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డ్‌లో మక్కా జొన్న (మొక్కజొన్న) రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తమ పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతులు పది రోజులుగా మార్కెట్లోనే తిండి నిద్ర లేక పడిగాపులు కాస్తున్నారు. మార్క్ ఫెడ్ (Markfed) కొనుగోలు ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లను చేపట్టినప్పటికీ, క్షేత్రస్థాయిలో కాంటాలు (తూకాలు) సక్రమంగా సాగడం లేదు.
సుదూర ప్రాంతాల నుండి ట్రాక్టర్లలో పంటను తీసుకువచ్చిన రైతులు, పది రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో మార్కెట్ యార్డ్‌లోనే అవస్థలు పడుతున్నారు.
ముందస్తు ప్రణాళిక లోపం కారణంగా మార్కెట్‌లో సరిపడా బార్దాన్ (గున్నీ) సంచులు అందుబాటులో లేవు. దీంతో కాంటాలు వేయడం నిలిచిపోయింది. దీనిపై రైతులు అధికారులను నిలదీస్తున్నారు.
ప్రభుత్వ మద్దతు ధర రూ. 2,400 లభిస్తుందన్న ఆశతో రైతులు మార్క్ ఫెడ్ కేంద్రాలకు వస్తుంటే, అక్కడ అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది.
తేమ శాతం, నాణ్యత సాకులతో పాటు ఒక ఎకరానికి కేవలం 26 క్వింటాలే కొనుగోలు చేస్తామన్న నిబంధనలు రైతులకు ఇబ్బందిగా మారాయి.
ఒకవైపు మార్క్ ఫెడ్ కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో, ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకే (రూ. 1,700 – రూ. 1,800) పంటను అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
”పంటను ఇంట్లో ఉంచుకుంటే ఎలుకల పాలు, మార్కెట్‌కు తెస్తే అధికారుల పాలు అవుతోంది” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే బార్దాన్ సంచులను సరఫరా చేసి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


