పచ్చని ప్రకృతి – ఆరోగ్యకర భవిష్యత్తు..ప్రజాపాలన ప్రగతి ర్యాలీ ప్రారంభం :
వరంగల్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఐదవ రోజు కార్యక్రమాలను ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన ప్రత్యేక ర్యాలీని జిల్లా కలెక్టర్ సత్య శారద జండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..”పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలి అంటే ప్రతి ఒక్కరు చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, సహజ వనరుల సంరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని.. ఆ అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు”.

ర్యాలీలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు చెట్ల పెంపకంలో కాలుష్య నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాల ప్రాధాన్యాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి రామిరెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సునీత, పదవీ విరమణ పొందిన డీఎఫ్‌వో పురుషోత్తం, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీ ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించే ప్రయత్నం చేశారు.


