మహబూబాబాద్:ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నాలుగేళ్ల చిన్నారి ప్రాణాల మీదకు వచ్చినంత పనైంది. కాలం చెల్లిన (Expired) మందులు ఇచ్చారంటూ ఆసుపత్రి సిబ్బందిపై ఒక తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌లోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మురళీ తన నాలుగేళ్ల కుమారుడు ఎనోస్ రాజ్ వాంతులు, విరోచనాలతో బాధపడుతుండటంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఓపీలో చిన్నారిని పరీక్షించిన వైద్యులు రెండు రకాల సిరప్‌లను రాశారు. ఆసుపత్రి ఫార్మసీ సిబ్బంది ఒక సిరప్‌ను ఇచ్చి, మరొకటి బయట మెడికల్ షాప్‌లో తీసుకోమని చెప్పారు.
అయితే, ఇంటికి వెళ్లిన తర్వాత బాబుకు సిరప్ వేసేందుకు తండ్రి మురళీ సీసాను పరిశీలించగా.. దానికి జూన్ 2026 నాటికే గడువు ముగిసి ఉన్నట్లు గమనించాడు. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న తండ్రి, కాలం చెల్లిన మందులు ఎలా ఇస్తారంటూ ఫార్మసీ సిబ్బందిని నిలదీశాడు. ఈ క్రమంలో సిబ్బందికి, తండ్రికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
”గడువు ముగిసిన మందులు ఇస్తే పిల్లాడు చావాలా?” అంటూ బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిన్న పిల్లల విషయంలో వైద్య సిబ్బంది ఇలాంటి బాధ్యతారాహిత్యానికి పాల్పడటంపై స్థానికులు, రోగుల బంధువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


