గ్రేటర్ వరంగల్‌లో అనధికారిక ఫ్లెక్సీలపై కొరడా.. కఠిన చర్యలకు బల్దియా హెచ్చరిక:
వరంగల్: గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో బల్దియా అనుమతులు లేకుండా కమర్షియల్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న హెచ్చరించారు. నగర సుందరీకరణకు విఘాతం కలిగించేలా అనధికారిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
ఫ్లెక్సీ తయారీదారులతో సమావేశం:
మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో నగరంలోని ఫ్లెక్సీ తయారీదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీల ముద్రణ, ఏర్పాటు విషయంలో పాటించాల్సిన నిబంధనలను కమిషనర్ వారికి వివరించారు. నిబంధనలకు సంబంధించిన సర్క్యులర్ కాపీలను అందజేసి, వాటి ప్రకారమే ఫ్లెక్సీలు ముద్రించాలని సూచించారు.
ప్రభుత్వ స్థలాల్లో అనుమతి లేదు:
ప్రభుత్వ స్థలాలు, భవనాలు, జంక్షన్లు, మీడియన్లు, డివైడర్లు, టెలిఫోన్, విద్యుత్ స్తంభాలు, చెట్లపై కమర్షియల్ ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేదని వెంకన్న స్పష్టం చేశారు. బల్దియా సూచించిన ప్రాంతాల్లో ముందస్తు అనుమతులు తీసుకున్న తర్వాతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని కమర్షియల్ సంస్థలకు సూచించారు.
ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు:
నిబంధనలు ఉల్లంఘిస్తే మునిసిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఫ్లెక్సీ తయారీదారుల కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి నిబంధనలు, ఆదేశాలను ఎప్పటికప్పుడు చేరవేస్తామని తెలిపారు. అనధికారిక ఫ్లెక్సీల నియంత్రణకు నగర పోలీస్ కమిషనర్‌తో త్వరలో సమావేశం నిర్వహించి పోలీసుల సహకారం కోరనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా అగ్నిమాపక అధికారి శంకర్ లింగం, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


