అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు సేవలందించిన మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ కన్నుమూశారు. 38 ఏళ్ల జద్రాన్ గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్న సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) అధికారికంగా ప్రకటించింది. ఈ వార్తతో అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
చికిత్స ఫలించక మృతి:
గత ఏడాది అక్టోబర్‌లో అనారోగ్యానికి గురైన షాపూర్ జద్రాన్ ఆరోగ్యం క్రమంగా విషమించింది. ఈ ఏడాది జనవరి నుంచి న్యూఢిల్లీలోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అఫ్గానిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్గాన్ కూడా ఆయనకు అండగా ఉన్నారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు.

అరుదైన రోగమే కారణం:
షాపూర్ జద్రాన్ ‘హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ (HLH)’ అనే అత్యంత అరుదైన రోగనిరోధక వ్యవస్థ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధిలో శరీరంలోని రోగనిరోధక కణాలు ఆరోగ్యకరమైన అవయవాలపైనే దాడి చేస్తాయి. దీంతో ఆయన రోగనిరోధక శక్తి పూర్తిగా బలహీనపడటంతో తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి మరింత విషమించింది.
షాపూర్ సేవలను గుర్తుచేసుకున్న ACB:
షాపూర్ జద్రాన్ మరణంపై అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. దేశంలో క్రికెట్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంది. అఫ్గాన్ క్రికెట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తొలి తరం ఆటగాళ్లలో షాపూర్ కీలక పాత్ర పోషించారని కొనియాడింది. ఆయన అంకితభావం, పట్టుదల, దేశం కోసం ఆడిన తీరు యువ క్రికెటర్లకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని బోర్డు వెల్లడించింది. షాపూర్ జద్రాన్ మృతితో అఫ్గానిస్తాన్ క్రికెట్ ఒక విలువైన ఆటగాడిని కోల్పోయింది.
Read Warangal News and Latest Politics News and Real Estate


