హనుమకొండ: గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సూచించారు. ఉత్సవాల ఏర్పాట్లు, విగ్రహాల నిమజ్జనం తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు.
సమన్వయంతో ఏర్పాట్లు :
హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో బుధవారం హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై సమన్వయ సమావేశం జరిగింది. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఆర్అండ్బీ, వైద్యారోగ్య, అగ్నిమాపక, మైనింగ్, మత్స్య తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సందర్భంగా సీపీ ఎన్. శ్వేత మాట్లాడుతూ.. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, విద్యుత్ కనెక్షన్ల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. పెద్ద మండపాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
రాత్రి 10 గంటల తర్వాత శబ్దం వద్దు :
ఉత్సవాల్లో సౌండ్ పొల్యూషన్‌కు తావులేకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల తర్వాత శబ్దం చేయరాదని, విద్యార్థులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్థానిక ఏసీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు.
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు :
వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని సురక్షితంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సీపీ ఆదేశించారు. చెరువులు, నీటి నిల్వల లోతు, నీటి మట్టాన్ని పరిశీలించి తగిన ప్రాంతాలను ఎంపిక చేయాలని తెలిపారు. నిమజ్జన ప్రదేశాల్లో క్రేన్లు, గజ ఈతగాళ్లు, లైటింగ్, బారికేడ్లు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. సమస్యలు ఎదురైతే పోలీస్ కంట్రోల్ రూమ్ 8712685048కు సమాచారం ఇవ్వాలని కోరారు.
పర్యావరణహితంగా పండుగ :
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. ప్రజలు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానిక ప్రాంతాలకు సమీపంలోనే నిమజ్జన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పర్యావరణహితంగా పండుగ జరుపుకోవాలని కోరారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాలను ప్రోత్సహించాలని ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


