గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో భారీ ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా 102 మంది కాంట్రాక్టర్లకు దాదాపు రూ.70 కోట్ల మేర డబుల్ బిల్లులు చెల్లించిన వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
రూ.70 కోట్లకు పైగా డబుల్ బిల్లులు :
కాంట్రాక్టర్లకు ఒకే పనికి రెండుసార్లు బిల్లులు చెల్లించినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. అంతేకాకుండా కొన్ని పనులకు నిర్ణయించిన మొత్తానికి మించి అదనపు నగదు చెల్లింపులు కూడా జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో జీహెచ్‌ఎంసీ ఆర్థిక వ్యవహారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాంట్రాక్టర్ల నుంచి నగదు రికవరీ :
అవకతవకలు వెలుగులోకి రావడంతో ఇప్పటికే చెల్లించిన అదనపు మొత్తాలను కాంట్రాక్టర్ల నుంచి తిరిగి రాబట్టే చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 12 మంది కాంట్రాక్టర్ల నుంచి సుమారు రూ.7 కోట్లను అధికారులు వసూలు చేసినట్లు సమాచారం. మిగిలిన మొత్తాన్ని కూడా రికవరీ చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
విజిలెన్స్ విచారణకు ఆదేశాలు :
ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విజిలెన్స్ విచారణకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఘటనకు బాధ్యుడిగా భావిస్తూ జీహెచ్‌ఎంసీ ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్ చంద్రను విధుల నుంచి తప్పించినట్లు సమాచారం. విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


