హైదరాబాద్/వరంగల్, మే 16: గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ధరలతో సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించాయి. శనివారం మార్కెట్ ముగిసే సమయానికి అటు బంగారం, ఇటు వెండి ధరల్లో స్పష్టమైన తగ్గుదల కనిపించింది.
పసిడి ధరల వివరాలు:
నగల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.900 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ.1,43,850 కి చేరింది.
అదేవిధంగా, అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల (బిస్కెట్) 10 గ్రాముల బంగారం ధర రూ.980 మేర క్షీణించి, రూ.1,56,930 వద్ద స్థిరపడింది.
కిలో వెండిపై రూ.15,000 క్షీణత!
బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో మరింత భారీ పతనం నమోదైంది. గత కొద్ది రోజులుగా భారీగా పెరిగిన వెండి, ఈరోజు ఏకంగా కిలోపై రూ.15,000 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,90,000 కు చేరుకుంది.


