హన్మకొండ : గోపాల్‌పూర్ ప్రధాన రహదారిపై శనివారం ఉదయం స్థానిక కాలనీవాసులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గోపాల్‌పూర్ చెరువు రిటెన్షన్ వాల్ (Retaining Wall) అభివృద్ధి పనులను కొందరు కావాలనే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రాస్తారోకో నిర్వహించారు.
స్వార్థ ప్రయోజనాల కోసమే కుట్రలు
స్థానిక తులసి బార్ ప్రధాన రహదారి జంక్షన్‌లో కాలనీవాసులంతా ఒక్కటై రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ… ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత చెరువు రిటైనింగ్ వాల్ అభివృద్ధి పనులు ప్రారంభమై, సాఫీగా సాగుతున్న తరుణంలో కొందరు స్వార్థపరులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనులను నిలిపివేయించడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
అభివృద్ధి పనులను అడ్డుకుంటే సహించేది లేదని, కాలనీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ రాస్తారోకో కారణంగా ప్రధాన రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.


