ప్రభుత్వ పాలిటెక్నిక్ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే నాయిని వినతి
హైదరాబాద్: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసి వినతిపత్రం సమర్పించారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఇ.వి. శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి మేకల అక్షయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వినతిపత్రాన్ని రూపొందించారు.
GO 97పై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి:
ప్రభుత్వ పాలిటెక్నిక్లకు సంబంధించిన జీఓ 97పై విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల్లో నెలకొన్న అపోహలను తొలగించి స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మంత్రిని కోరారు. జీఓపై పూర్తి వివరాలను వెల్లడించడం ద్వారా విద్యార్థులు, సిబ్బందిలో నెలకొన్న ఆందోళనలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
సాంకేతిక విద్య బలోపేతానికి చర్యలు :
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే కోరారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు అధ్యాపకులు, ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, సాంకేతిక విద్యను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు అందించవచ్చని నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.


