ప్రభుత్వ పాఠశాలలకు ముందుగానే పాఠ్య పుస్తకాల సరఫరా.. విద్యార్థులకు తొలి రోజే అందుబాటులో పుస్తకాలు :
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ముందస్తు చర్యలు చేపడుతుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు చేరవేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రస్తుతం వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ జిల్లా కేంద్రాల నుంచి మండలాల వారీగా పుస్తకాల పంపిణీ జరుగుతుంది.
ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించేదుకు అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. గతంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కొన్ని రోజులు లేదా వారాలపాటు పుస్తకాల కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. అయితే ఈసారి అలాంటి పరిస్థితులు లేకుండా ముందుగానే సరఫరా చర్యలు చేపట్టడం విశేషం.
పాఠ్యపుస్తకాలు సమయానికి అందుబాటులో ఉండడం వల్ల విద్యార్థులు మొదటి రోజు నుంచి పాఠాలను ప్రారంభించే అవకాశం కలుగుతుంది. దీంతో బోధన ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యా కార్యక్రమాలు సజావుగా కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ ముందు చూపు నిర్ణయం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచేందుకు ఈ చర్య దోహదపడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.


