వరంగల్ నగరంలోని ములుగు రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల నూతన భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ₹25 కోట్లు మంజూరు చేసింది. గత 50 ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించిన ఈ ప్రాచీన సంస్థకు నూతన భవన నిధులు మంజూరు చేయడం పట్ల వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శుక్రవారం ఐటీఐ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. నాలుగు నెలల క్రితం తాను స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి భవన నిర్మాణం కోసం విజ్ఞప్తి చేయగా, సానుకూలంగా స్పందించి రూ. 25 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే 50 సంవత్సరాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ కళాశాలను సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
పరిశ్రమలు, రైల్వే రంగానికి తగినట్లుగా నైపుణ్య శిక్షణ
వరంగల్ యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భవిష్యత్తులో రైల్వే, ఇతర పారిశ్రామిక రంగాల్లో వచ్చే ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా విద్యార్థులకు అవసరమైన కోర్సులు, శిక్షణను ఐటీఐలోనే అందించాలని యాజమాన్యానికి సూచించారు.
ఐటీఐతో పాటు పాలిటెక్నిక్ కళాశాలలను కూడా ఆధునిక సాంకేతిక విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్ది, కోర్సు పూర్తయ్యే నాటికే ఉద్యోగ అర్హత సాధించేలా శిక్షణనివ్వాలన్నారు. వరంగల్‌ను ఎడ్యుకేషన్, మెడికల్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని.. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్, మాస్టర్ ప్లాన్ పనులు వేగవంతం అవుతున్నాయని పేర్కొన్నారు.
పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం, హరిత ప్రాంగణం
ఈ కళాశాలలో ఇప్పటివరకు శిక్షణ పొందిన సుమారు 50 వేల మంది పూర్వ విద్యార్థుల వివరాలు సేకరించి, వారితో అనుసంధానం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ విదేశాల్లో స్థిరపడిన వారి సహకారాన్ని కళాశాల అభివృద్ధికి వినియోగించుకోవాలని కోరారు. అలాగే, కళాశాల ప్రాంగణంలో పచ్చదనాన్ని పెంచేలా ఖాళీ స్థలాలను గ్రీన్ ఏరియాలుగా తీర్చిదిద్దాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తాత్కాలిక హామీలకే పరిమితం కాకుండా విద్య, ఉపాధి, శాశ్వత మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతోందని నాయిని పునరుద్ఘాటించారు.
హాజరైన ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో తెలుగు అకాడమీ ఛైర్మన్ ప్రొఫెసర్ వెంకట నారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి సురేందర్, జక్కుల రవీందర్, బోడ డిన్నలతో పాటు నాయకులు అంబేద్కర్ రాజు, గోల్కొండ సాంబయ్య, సృజన్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

