భావితరాల కోసం హరిత సంకల్పం.. పర్యావరణ పరిరక్షణపై సీపీ కీలక పిలుపు :
వరంగల్: పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని.. భవిష్యత్తు తరాలకు కాలుష్యరహిత వాతావరణం అందించాలంటే ఇప్పటినుంచి ప్రతి ఒక్కరు చొరవ తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అధికారులు సిబ్బందితో కలిసి పండ్ల మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ప్రపంచవ్యాప్తంగా అటవీ సంపద క్రమంగా తగ్గిపోవడం, పట్టణీకరణ వేగంగా పెరగడం , పచ్చదనం స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు విస్తరించడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కూడా ప్రకృతి పై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు”.

పర్యావరణ మార్పులు కారణంగా వర్షపాతం సరైన సమయంలో లేకపోవడం, ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వంటి పరిణామాలు ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆయన వివరించారు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని పెంచే బాధ్యత తీసుకుంటే పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున తోడ్పాటు అందించినట్లు అవుతుందని సిపి పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఆర్‌ఐలు తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


